అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi Airport | 13 ఏళ్ల ఆఫ్ఘనిస్థాన్ బాలుడు(Afghanisthan Boy) చేసిన సాహసం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విమానంలోని అత్యంత ప్రమాదకరమైన భాగమైన ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని కాబూల్ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం చేసిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కందూజ్‌కు చెందిన ఈ బాలుడు, కాబూల్ విమానాశ్రయం(Kabul Airport)లో సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి ప్రవేశించాడు. అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరబోయే విమానం దగ్గరకు వెళ్లి, టైర్ల భాగం దగ్గర ఉన్న ల్యాండింగ్ గేర్(Landing Gear)లోకి దూరిపోయాడు. ఎవరికి పట్టుబడకుండా, ఎటువంటి విమాన టికెట్ లేకుండానే, సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘ ప్రయాణం చేశాడు.
Delhi Airport | మరీ అంత రిస్కా..
అయితే ఆక్సిజన్ తక్కువగా ఉండడంతో పాటు గాలిలో గణనీయమైన ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో బాలుడు సురక్షితంగా ఉండడం అధికారులను షాక్‌కు గురిచేసింది. విమానం ఢిల్లీలో ఆదివారం ఉదయం 11 గంటలకు ల్యాండ్ అయిన అనంతరం, బాలుడు ఎయిర్‌పోర్ట్(Delhi Airport) పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా CISF భద్రతా సిబ్బంది గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారణ జరపగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడు మాట్లాడుతూ .. సరదా కోసం… సాహసం చేయాలన్న కోరికతోనే ఇలా చేశాను అని చెప్పాడు.
సిబ్బంది వెంటనే అప్రమత్తమై విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. బాలుడు దాక్కున్న ప్రదేశంలో ఒక చిన్న ఎరుపు రంగు స్పీకర్ తప్ప మరేమీ కనిపించలేదు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో విమానాన్ని తిరిగి నార్మల్ సర్వీస్‌కు అనుమతించారు. ఈ సంఘటనపై అధికారులు పూర్తి నివేదిక తయారు చేసి, బాలుడిని అదే విమానంలో ఆ రాత్రే తిరిగి కాబూల్‌కు పంపించారు. వాస్తవం తెలిసిన తర్వాత KAM Air సంస్థ అధికారిక ప్రకటనలో, భద్రతాపరమైన వ్యవస్థలపై మళ్లీ సమీక్ష చేపడతామని పేర్కొంది. సాధారణంగా విమానాల్లో ల్యాండింగ్ గేర్ ప్రాంతం ప్రయాణానికి సురక్షితమైన చోటు కాదు. అక్కడ ఆక్సిజన్ తీవ్రంగా తగ్గుతుంది, గాలిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రాణాలకు ముప్పు తప్పదు. అయినా, ఆ బాలుడు చిన్న వయసులోనే ఈ స్థాయిలో సాహసం చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం కాగా, భద్రతా విభాగాలపై ప్రశ్నలు కూడా రేపుతోంది.