అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. పాన్ డబ్బాల నుంచి మొదలు పెడితే పెద్దపెద్ద బార్ల వరకు గంజాయి అమ్మకాలు సాగుతన్నాయి. గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా మారి ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నగరంలో డ్రగ్స్‌పై ఈగల్ టీం (Eagle Team) ఉక్కుపాదం మోపుతున్నా.. దందా మాత్రం ఆగడం లేదు. నగరంలో విక్రయాలతో పాటు హైదరాబాద్ మీదుగా బెంగళూరు, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారు. తాజాగా నగరంలోని పటాన్చెరులో (Patancheru) పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | కార్లలో ప్రత్యేక క్యాబిన్
పటాన్‌చెరు పాటి చౌరస్తాలో 128 కిలోల గంజాయిని SNAB, BDL భానుర్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి తరలింపు కోసం ఈ ముఠా కార్లలో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయడం గమనార్హం. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad | ఎయిర్‌పోర్టులో..
రాయదుర్గంలో ఇటీవల పది కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద రూ.13.3కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో రూ.40 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో భారీ మొత్తంలో గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మహా నగరంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. పలువురు గంజాయి మత్తులో నడి రోడ్డుపై వీరంగం చేస్తున్న వీడియోల ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. గంజాయి దందాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.