అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi | ఢిల్లీలోని ప్రైవేట్ స్కూళ్లకు పలుమార్లు వచ్చిన బాంబు బెదిరింపులు (Bomb Threats) ఉత్తివేనని పోలీసులు తేల్చారు. ఈ బెదిరింపు మెయిల్స్ పంపించిన వ్యక్తి,ని, అందుకు గల కారణాన్ని గుర్తించి వారు అవాక్కయ్యారు. 12 ఏళ్ల బాలుడు (12 Year Old Boy) ఈ పని చేశాడని, స్కూల్ బంద్ ఇస్తారనే ఉద్దేశంతోనే ఫేక్ మెయిల్స్ (Fake Mails) పంపించాడని గుర్తించారు.
ఢిల్లీలోని స్కూళ్లకు ఇటీవల తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. మంగళవారం కూడా సెయింట్ స్టీఫెన్స్ కళాశాల (St. Stephens College), సెయింట్ థామస్ పాఠశాల (St. Thomas School)లో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేయగా, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. భయాందోళనలకు గురిచేసిన బాంబు బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చాయని దర్యాప్తు చేయగా, 12 ఏళ్ల బాలుడు ఈ పని చేసినట్లు గుర్తించారు.
Delhi | బంద్ ఇస్తారని..
సెయింట్ స్టీఫెన్స్ కళాశాల లైబ్రరీతో సహా క్యాంపస్ చుట్టూ నాలుగు IEDలు, రెండు RDX పేలుడు పదార్థాలు ఉంచినట్లు, మధ్యాహ్నం 2 గంటలకు అవి పేలిపోతాయని మంగళవారం ఈమెయిల్‌లో వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన కాలేజీని ఖాళీ చేయించి, సోదాలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు ఏవీ లభించలేదు.
అయితే, మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో సైబర్ సెల్ పోలీసులు(Cyber Cell Police) గుర్తించారు. బాలుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా, అతడు చెప్పిన సమాధానం విని నివ్వెరపోయారు. నగరంలోని వేరే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆ బాలుడు స్కూల్‌ను మూసి వేస్తారన్న ఉద్దేశంతో నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్‌లను పంపాడని పోలీసులు తెలిపారు. ఒక కళాశాల (సెయింట్ స్టీఫెన్స్) ఒక పాఠశాల (సెయింట్ థామస్) ఈ మెయిల్ ఐడీలను పొరపాటున ట్యాగ్ చేశానని విద్యార్థి చెప్పాడు. “విచారణ సమయంలో, బాలుడు తాను సరదాగా ఈమెయిల్ పంపానని ఒప్పుకున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు కానీ తరువాత కౌన్సెలింగ్ సెషన్ల తర్వాత విడుదల చేశారు” అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.