అక్షరటుడే, వెబ్డెస్క్ : Cloudburst | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం క్లౌడ్ బరస్ట్ అయి కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఒకేసారి భారీ వర్షం కురవడంతో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఉత్తరకాశీలోని ధరాలీ గ్రామం (Dharali Village) వరదల ధాటికి కొట్టుకుపోయింది. ఈ ఘటన అనంతరం అధికారులు సహాయక చర్యలు (Rescue Operation) చేపట్టారు.
ధరాలీలో ఆర్మీ బేస్ క్యాంప్ (Army Base Camp) ఉంది. అయితే వరదలకు బేస్ క్యాంపు కొట్టుకుపోయింది. జేసీవో సహా పది మంది జవాన్లు గల్లంతయ్యారు. వరదలతో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి. 60 మందికి పైగా గల్లంతయినట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇళ్లు కొట్టుకుపోవడంతో పాటు, బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది అవుతోంది. ఆర్మీ, NDRF, SDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. గాయపడిన 20 మందిని ఆర్మీ సిబ్బంది కాపాడి ఆస్పత్రికి తరలించారు.
Cloudburst | యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు
ధరాలి గ్రామంలో వరదలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) విచారం వ్యక్తం చేశారు. SDRF, NDRF, జిల్లా యంత్రాంగం, ఇతర సంబంధిత బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. తాను సహాయక చర్యలపై సీనియర్ అధికారులతో పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
Cloudburst | విచారం వ్యక్తం చేసిన ప్రధాని
ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Naredra Modi) విచారం వ్యక్తంచేశారు. ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి మాట్లాడారు. ధరాలీ గ్రామాన్ని వరదలు ముంచెత్తడంపై బాధాకరమన్నారు. బాధితులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.