Homeక్రీడలుFauja Singh | మారథాన్ రన్నర్ ఫౌజాసింగ్‌ను కారుతో ఢీకొట్టిన ఎన్ఆర్ఐ.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి

Fauja Singh | మారథాన్ రన్నర్ ఫౌజాసింగ్‌ను కారుతో ఢీకొట్టిన ఎన్ఆర్ఐ.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fauja Singh | పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ సమీపంలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ప్రపంచ ప్రఖ్యాత మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ (Marathon runner Fauja Singh) దుర్మరణం పాలయ్యారు. ‘టర్బన్డ్ టొర్నాడో’ (Turbaned Tornado) అనే బిరుదుతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ మారథాన్ వీరుడు వయస్సు 114 సంవత్సరాలు. అయినా రోజూ వాకింగ్, ఫిట్‌నెస్ పట్ల ఆయనలో ఉన్న శ్రద్ధ అనేక మందికి స్ఫూర్తిదాయకం. అయితే జలంధర్ శివారు(Jalandhar Shivaru)లో వాకింగ్ చేస్తున్న సమయంలో, ఓ వేగంగా దూసుకొచ్చిన కారు ఫౌజా సింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ ఆగకుండా అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.

Fauja Singh | రోడ్డు దాటుతుండ‌గా..

పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాలు ఆధారంగా, ఈ ప్రమాదానికి కారణమైన 30 ఏళ్ల ఎన్ఆర్ఐ(NRI) వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఇటీవలే విదేశాల నుంచి పంజాబ్‌(Punjab)కు వచ్చినట్లు సమాచారం. అతడిపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి, ప్రస్తుతం విచారణ చేపట్టారు. ఫౌజా సింగ్ మృతిపై చాలా మంది దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.

ఫౌజా సింగ్ పేరు చెబితే వినిపించేది పట్టుదల, పోరాట పటిమ, స్ఫూర్తి. శతాబ్దం వయస్సు దాటినా, ఆయన మారథాన్‌ల‌లో పరిగెత్తారు. లండన్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక పోటీలలో పాల్గొన్నారు. ఆయన జీవితం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. యువతకు ఆరోగ్యవంతమైన జీవనశైలిపై దృష్టి పెట్టాలని ఆయన తరచూ చెప్పేవారు. 1911 ఏప్రిల్‌ 1న జన్మించిన ఫౌజాసింగ్‌ 89 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌ కెరీర్‌ మొదలుపెట్ట‌డం విశేషం. 2011లో జరిగిన టొరంటో మారథాన్‌లో 100 ఏళ్ల వయసులో 8 గంటల 11 నిమిషాల్లో రేసు పూర్తి చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.

త‌న 14 ఏళ్ల అథ్లెటిక్స్‌ కెరీర్‌లో తొమ్మిది మారథాన్‌ రేసుల్లో పోటీలో పాల్గొన్నారు. కుటుంబసభ్యుల మరణాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఫౌజా సింగ్ ఈ ప‌రుగును ఎంచుకున్నారు. 2012లో జరిగిన హాంకాంగ్‌ మారథాన్ ఫౌజా సింగ్ చివరి అంతర్జాతీయ రేసుగా నిలిచింది. ఫౌజా సింగ్ మరణ వార్త వెలుగులోకి రాగానే సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రీడాభిమానులు ఆయనకు నివాళులర్పించారు. పంజాబ్‌లోని ప్రజలు ఆయన మరణాన్ని తీరనిలోటుగా భావిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.