అక్షరటుడే, ఇందూరు : RSS | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(Rashtriya Swayamsevak Sangh) ను 1925 విజయ దశమి రోజున స్థాపించారు. గురువారంతో వందేళ్లవుతున్న సందర్భంగా సంఘ్ పరివార్ సంస్థలు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. సంఘ్ చరిత్రలో ఇందూరు పుటలూ ఉన్నాయి.
1925లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్(RSS) ప్రారంభమైంది. అక్కడినుంచి క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. తొలితరం స్వయం సేవకులు(ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు) చాలామంది తమ జీవతాలను సంఘానికి అంకితం చేశారు. ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ భరత మాత సేవలో గడిపారు. నాగ్‌పూర్‌నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి సంఘ శాఖలను ప్రారంభించారు. ఇలా తొలితరం స్వయం సేవక్ ఒకరు హైదరాబాద్(Hyderabad) వచ్చి సంఘ కార్యాన్ని ప్రారంభించారు. ఆయన ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇందూరు విద్యార్థి రేణుకారావు దేశ్ పాండేకు సంఘ్ పరిచయమైంది. యూనివర్సిటీలో చురుకుగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలలో పాల్గొన్న ఆయన.. వేసవి సెలవుల సమయంలో ఇందూరుకు వచ్చి ఇక్కడ 1950 లో మొదటి శాఖను ప్రారంభించారు. ప్రస్తుత వీక్లీ బజార్(Weekly Bazar) ప్రాంతంలో తుంగ చెట్లతో నిండి ఉన్న ప్రాంతంలో శాఖను నడిపారు. తొలి శాఖకు 12 మంది విద్యార్థులు హాజరయ్యారని మొదటి తరం స్వయంసేవక్ కాల్వగడ్డ గంగాధర్ తెలిపారు.
RSS | 1954లో తొలి ప్రచారక్..
ఆర్‌ఎస్‌ఎస్ శాఖ కార్యాన్ని విస్తరించేందుకు ప్రచారక్‌లు కృషి చేస్తారు. అలా 1954లో పుణె నగరానికి చెందిన బాలముకుంద సావరేకర్ ఇందూరుకు తొలి ప్రచారక్‌గా వచ్చారు. ఆయన ఇక్కడే ఉండి సంఘ కార్యాన్ని విస్తరించారు. వీక్లీ బజార్ తర్వాత గాజులపేటలోని సంతాచారి మఠం (దత్త మందిర్) లో మరో శాఖ, ప్రస్తుతం గర్ల్స్ హైస్కూల్‌గా పిలవబడుతున్న కోటగల్లిలోని బాలికల పాఠశాల మైదానంలో శివాజీ శాఖ ప్రారంభమయ్యాయి.
RSS | అన్నిచోట్ల శాఖలు..
ఇలా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్.. జిల్లా అంతటా విస్తరించింది. పని విభజన కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఇందూరు నగరాన్ని 50 బస్తీలుగా విభజించింది. ఈ 50 బస్తీలలోనూ శాఖలు నడుస్తున్నాయి. ఇందూరు జిల్లాలో 65 ఉప మండలాలు, 70 బస్తీలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో అన్ని ఉప మండలాలు, బస్తీలలో శాఖ నడిచిన మొదటి జిల్లాగా ఇందూరు పేరు సంపాదించింది.